
గౌరీదేవిపేట పీహెచ్‌సీ వైద్యాధికారి నిర్లక్ష్యమే కారణం: ఆదివాసీ సంక్షేమ పరిషత్
దోషులపై చర్యలు తీసుకోకపోతే హైకోర్టును ఆశ్రయిస్తాం: కుంజ శ్రీను
చింతూరు, సెప్టెంబర్ 11 (వై7 న్యూస్ తెలుగు):
ఎటపాక మండలం గొల్లగుప్ప గ్రామంలో మలేరియా నివారణ మాత్రల పంపిణీ అనంతరం 7 ఏళ్ల ఆదివాసీ బాలిక మాడవి జమున మృతి చెందడం, మరో 53 మంది అస్వస్థతకు గురైన ఘటనపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) స్పందించినట్లు ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలతో 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శికి కమిషన్ నోటీసులు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు.
ఈ ఘటన జరిగి ఇన్ని రోజులు గడిచినా బాధ్యులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోందని కుంజ శ్రీను పేర్కొన్నారు. గొల్లగుప్ప గ్రామం గౌరీదేవిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోకి వస్తుందని, అయితే మెడికల్ క్యాంప్ నిర్వహించిన రోజున అక్కడి వైద్యాధికారి హాజరుకాలేదని ఆరోపించారు. వైద్యాధికారి లేకుండానే కింది స్థాయి సిబ్బంది మోతాదుకు మించి మందులు పంపిణీ చేయడం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందని ఆయన విమర్శించారు.
ఈ ఘటనకు సంబంధించి గౌరీదేవిపేట పీహెచ్‌సీ వైద్యాధికారిపై తక్షణమే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనకు రెండు రోజుల ముందు పద్దం రోజా అనే 10 ఏళ్ల బాలిక మలేరియాతో మృతి చెందిన విషయాన్ని కూడా అధికారులు దాచిపెట్టారని, వాస్తవాలను మరుగునపరిచే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు.
గొల్లగుప్ప వంటి తీవ్రమైన ఘటన చోటుచేసుకున్నప్పటికీ సంబంధిత వైద్యాధికారి సంఘటన స్థలాన్ని సందర్శించకుండా ఇతర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని కుంజ శ్రీను అన్నారు. మృతి చెందిన బాలికకు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటూ ప్రచారం చేయడాన్ని ఆదివాసీ సంక్షేమ పరిషత్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
ఈ మొత్తం వ్యవహారంపై జిల్లా కలెక్టర్ శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని డిమాండ్ చేశారు. జాతీయ ఎస్టీ కమిషన్ నోటీసులకు జిల్లా యంత్రాంగం ఎలాంటి సమాధానం ఇస్తుందో వేచి చూస్తున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే ఆదివాసీ సంఘాల తరఫున హైకోర్టును ఆశ్రయించే అంశాన్ని పరిశీలిస్తామని హెచ్చరించారు.
అమాయక ఆదివాసీ పిల్లల ప్రాణాలకు కారణమైన వారిని చట్టం ముందు నిలబెట్టే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కుంజ శ్రీను స్పష్టం చేశారు.









