ఇజ్రాయెల్‌పై 2023 అక్టోబర్ 7న జరిగిన హమాస్ దాడికి సంబంధించి తాజాగా వెలుగులోకి వచ్చిన అంశాలు ఆ దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇజ్రాయెల్ జర్నలిస్టులు ష్లోమీ ఎల్దార్, రూత్ యువల్ రచించిన ‘Hostages: 843 Days of Abandonment’ పుస్తకంలో.. దాడికి సుమారు వారం నుంచి పది రోజుల ముందే హమాస్ భారీ ఆపరేషన్‌కు సిద్ధమవుతోందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు సమాచారం అందిందని పేర్కొన్నట్లు నివేదికలు వెల్లడించాయి.
పుస్తకంలో పేర్కొన్న వివరాల ప్రకారం.. యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడి, హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ ఒక భారీ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్నట్లు హెచ్చరించినట్లు చెబుతున్నారు. ఈ సంభాషణ సుమారు 45 నిమిషాల పాటు సాగిందని, అయితే నెతన్యాహు ఈ సమాచారాన్ని భద్రతా వ్యవస్థకు తెలియజేయలేదని పుస్తకంలో పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలను నెతన్యాహు కార్యాలయం తీవ్రంగా ఖండించింది. అలాంటి హెచ్చరిక తనకు అందలేదని, యూఏఈ అధ్యక్షుడితో ఆ సమయంలో తాను మాట్లాడలేదని నెతన్యాహు స్పష్టం చేశారు.
ఈ ఆరోపణలు వెలుగులోకి రావడంతో అక్టోబర్ 7 దాడికి ముందు నెతన్యాహుకు అసలు ఏ సమాచారం తెలుసు? ఆయనకు ఎప్పుడు తెలుసు? ఆ సమాచారంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే ప్రశ్నలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇప్పటికే భద్రతా వైఫల్యాలపై నెతన్యాహుపై విమర్శలు ఎదురవుతుండగా, తాజా పుస్తకంలోని ఆరోపణలు రాజకీయంగా మరింత ఒత్తిడిని పెంచాయి. అయితే పుస్తకంలో వచ్చిన ఆరోపణలు, నెతన్యాహు చేసిన ఖండన మధ్య వాస్తవాలను నిర్ధారించేందుకు స్వతంత్ర దర్యాప్తు అవసరమనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.








