ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధాలు, మహమ్మారులు, వాతావరణ మార్పుల కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాన్ని కాపాడుకోవడంతో పాటు భవిష్యత్తులో ఎదురయ్యే అంతర్జాతీయ సంక్షోభాలను తట్టుకునేలా సిద్ధంగా ఉండాలని సూచించారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ముందు జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బ్రిక్స్ దేశాల మధ్య సరఫరా గొలుసుల అనుసంధానం, పారదర్శక వాణిజ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని జైశంకర్ పేర్కొన్నారు. సేవా రంగం, వ్యవసాయం, అగ్రి-టెక్నాలజీ, డిజిటల్ సేవలు, ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లు, మహిళల నాయకత్వంలోని వ్యాపారాలను ప్రోత్సహించాలని సూచించారు. సభ్య దేశాల మధ్య ఉన్న వాణిజ్య అవకాశాలను బలమైన భాగస్వామ్యాలుగా మార్చుకోవడంపై వ్యాపార వర్గాలు దృష్టి పెట్టాలని కోరారు.
ఆర్థిక కార్యకలాపాలు పెరగడంతో పాటు ఆర్థిక భద్రత సాధించినప్పుడే బ్రిక్స్ కూటమికి నిజమైన స్వయంసమృద్ధి సాధ్యమవుతుందని జైశంకర్ అన్నారు. అయితే స్వయంసమృద్ధి అనేది సొంత దేశ ప్రయోజనాలకే పరిమితం కాకూడదని స్పష్టం చేశారు. విశ్వసనీయమైన లాజిస్టిక్స్, స్పష్టమైన వ్యాపార నిబంధనలు, విభిన్న వాణిజ్య సంబంధాలు, పారదర్శక పెట్టుబడులతో కూడిన బలమైన వ్యాపార వాతావరణాన్ని బ్రిక్స్ దేశాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.








