
భద్రాచలం, సెప్టెంబర్ 9 (వై7 న్యూస్ తెలుగు):
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా భద్రాచలంలో టీడీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల వెలిగింపు కార్యక్రమం నిర్వహించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపు మేరకు ‘నిజం గెలిచింది’ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

భద్రాచలం కూనవరం రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద బుధవారం రాత్రి 7.30 గంటలకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. చంద్రబాబు నాయుడి అరెస్టును టీడీపీ శ్రేణులు ‘బ్లాక్ డే’గా పేర్కొన్నారు.
ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడిని అర్ధరాత్రి అరెస్టు చేసి రోడ్డు మార్గంలో కోర్టుకు తరలించారని, అనంతరం 53 రోజుల పాటు జైలులో ఉంచారని పేర్కొన్నారు. ఈ కేసులో చంద్రబాబుకు కోర్టులు, ఈడీ నుంచి క్లీన్‌చిట్ లభించిందని వారు తెలిపారు. న్యాయం చివరకు గెలిచిందనే సందేశంతోనే ‘నిజం గెలిచింది’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొడాలి శ్రీనివాసరావు, తాళ్లూరి చిట్టిబాబు, నూతలపాటి దాసయ్య, పోటు వెంకటేశ్వరరావు, కొడాలి లక్ష్మీ నరసింహరావు, కొండవీటి చిరంజీవి, బాచినేని రాంబాబు, కొండవీటి అశోక్, కొర్లపాటి రాము, కొండవీటి రమేష్, మద్దిపాటి రాము, పోటు రాంబాబు, రాకేష్, నూతలపాటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.








