నోయిడాలో మహిళా భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. పార్సిల్ డెలివరీ చేయడానికి వచ్చిన ఓ ర్యాపిడో రైడర్.. డెలివరీ పూర్తయిన తర్వాత మహిళ వ్యక్తిగత ఫోన్ నంబర్‌కు సందేశాలు పంపిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో మహిళల భద్రతపై చర్చ మొదలైంది.
వివరాల్లోకి వెళ్తే.. నోయిడాకు చెందిన ఓ మహిళకు ర్యాపిడో ద్వారా పార్సిల్ డెలివరీ అయ్యింది. డెలివరీ పూర్తయిన కొద్దిసేపటికే రైడర్ ఆమె వ్యక్తిగత నంబర్‌కు ‘హలో.. ఎలా ఉన్నారు?’ అంటూ మెసేజ్ పంపినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఎలాంటి పరిచయం లేకుండానే ‘ఐ లవ్ యూ’ అంటూ మరో సందేశం పంపడంతో ఆమె తీవ్ర అసౌకర్యానికి గురైనట్లు సమాచారం.
దీంతో ఆ మహిళ రైడర్‌ను వెంటనే హెచ్చరించింది. తనకు ఇలాంటి సందేశాలు పంపవద్దని, వేధింపులు కొనసాగిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. డెలివరీ సేవల కోసం వినియోగదారులు ఇచ్చే వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయకుండా సంస్థలు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.









