
పలాస, వై7 న్యూస్:
పలాస నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ సమన్వయకర్త వెంకన్న చౌదరి ఆధ్వర్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పలాస నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలు, ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు తదితర అంశాలపై నాయకులు విస్తృతంగా చర్చించారు. కూటమి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన పాలన, సంక్షేమ ఫలాలు అందేలా మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని, ప్రజలతో నిరంతరం మమేకమై పనిచేయాలని నాయకులకు సూచించారు. అలాగే ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు చేరేలా చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది.
ఈ సందర్భంగా వెంకన్న చౌదరి మాట్లాడుతూ, కూటమి పార్టీల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ పలాస నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.








