E-PAPER

లక్షణాలు లేకుండానే లివర్‌కు సమస్య.. తొలి దశలోనే గుర్తించడం ఎలా..?

ఫ్యాటీ లివర్‌ ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న సమస్య. లివర్‌లో సాధారణ స్థాయి కంటే ఎక్కువ కొవ్వు పేరుకుపోతే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఇందులో తొలి దశను గ్రేడ్‌-1 ఫ్యాటీ లివర్‌ లేదా మైల్డ్‌ స్టియాటోసిస్‌ అంటారు.

గ్రేడ్‌-1 ఫ్యాటీ లివర్‌ సాధారణంగా పెద్దగా ప్రమాదకరం కాదు. ఈ దశలో లివర్‌ నిర్మాణం సాధారణంగానే ఉంటుంది. అయితే సమస్యను నిర్లక్ష్యం చేస్తే కొవ్వు పేరుకుపోవడం పెరిగి తదుపరి దశలకు చేరే అవకాశం ఉంటుంది. అందుకే తొలిదశలోనే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం కీలకం.

లక్షణాలు కనిపించకపోవచ్చు
గ్రేడ్‌-1 ఫ్యాటీ లివర్‌ ఉన్న చాలామందిలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు. ఇతర ఆరోగ్య సమస్యల కోసం పరీక్షలు చేయించుకున్నప్పుడు అల్ట్రాసౌండ్‌లో అనుకోకుండా బయటపడుతుంది. కొందరిలో అలసట, పొట్ట పైభాగంలో స్వల్పంగా బరువుగా అనిపించడం, కడుపు ఉబ్బరం, నీరసం వంటి లక్షణాలు కనిపించవచ్చు.

ఎందుకు వస్తుంది?
అధిక బరువు, ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం ఫ్యాటీ లివర్‌కు ప్రధాన కారణాల్లో ఒకటి. మధుమేహం, ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌, అధిక కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లు కూడా దీనికి దారితీయవచ్చు. ఎక్కువగా మద్యం తీసుకోవడం, ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం కూడా ప్రమాదాన్ని పెంచుతాయి.

పూర్తిగా తగ్గించుకోవచ్చా?
గ్రేడ్‌-1 ఫ్యాటీ లివర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే జీవనశైలిలో మార్పులతో మెరుగుపడే అవకాశం ఉంది. బరువు తగ్గడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ముఖ్యమైనవి. మధుమేహం, ఊబకాయం, కొలెస్ట్రాల్‌ వంటి సమస్యలను కూడా నియంత్రించాలి.

ఆహారంలో హోల్‌ గ్రెయిన్స్‌ (అన్ని రకాల ధాన్యాలు), పండ్లు, కూరగాయలు, పప్పులు, గింజలు, నట్స్‌, కొవ్వు తక్కువగా ఉండే ప్రొటీన్లు చేర్చుకోవచ్చు. చక్కెర కలిగిన పానీయాలు, ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌, డీప్‌ ఫ్రైడ్‌ ఆహారం, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు తగ్గించాలి. మద్యం తీసుకునే వారు దాన్ని పూర్తిగా నివారించడం మంచిది.

కాలేయ ఎంజైమ్‌లు పెరగడం, మధుమేహం లేదా ఊబకాయం ఉండటం, కుటుంబంలో కాలేయ వ్యాధుల చరిత్ర ఉండటం వంటి పరిస్థితుల్లో వైద్యుడిని సంప్రదించాలి. గ్రేడ్‌-1 ఫ్యాటీ లివర్‌ కనిపించిందని భయపడాల్సిన అవసరం లేదు. కానీ దాన్ని నిర్లక్ష్యం చేయకపోవడం చాలా ముఖ్యం.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!