ఎముకలు, కండరాలను బలంగా ఉంచడంలో విటమిన్ డి ఎంతగానో సహాయపడుతుందని అందరికీ తెలిసిందే. అయితే, శరీరంలో దీని పాత్ర కేవలం అస్థిపంజర ఆరోగ్యానికే పరిమితం కాలేదు. ఇది మన శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, మెదడు పనితీరును మెరుగుపరిచి మానసిక ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలను దూరం చేయడంలోనూ, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు. అయితే, ప్రస్తుతం ఇళ్లు లేదా ఆఫీసులోనే ఎక్కువ సమయం గడపడం, శరీరానికి తగినంత సూర్యరశ్మి తగలకపోవడం, సరైన ఆహార అలవాట్లు లేకపోవడం వంటి కారణాల వల్ల విటమిన్ డి లోపంతో చాలా మంది బాధపడుతున్నారు.
ఈ క్రమంలో గుండె ఆరోగ్యంపై విటమిన్ డి ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై నిపుణులు నిరంతరం పరిశోధనలు చేస్తున్నారు. శరీరంలో విటమిన్ డి స్థాయిలు తగ్గడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, సంపూర్ణ ఆరోగ్యం కోసం శరీరంలో తగినంత విటమిన్ డి స్థాయిలను కాపాడుకోవడం ఎంతో ముఖ్యమని సూచిస్తున్నారు.
విటమిన్ డి లోపం గుండెపై ప్రభావం చూపుతుందా? : శరీరంలో విటమిన్ డి స్థాయిలు తగ్గడం అనేది కొన్ని రకాల గుండె సమస్యలు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. గుండె, రక్తనాళాలకు మేలు చేసే ప్రక్రియలతో పాటు, శరీరంలోని పలు కీలక విధులలో విటమిన్ డి ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని పేర్కొంటున్నారు. అయితే, కేవలం విటమిన్ డి లోపం వల్లే గుండె జబ్బులు వస్తాయని ఎలాంటి ఆధారాలు లేవని తెలియజేస్తున్నారు. గుండె ఆరోగ్యం అనేది అధిక రక్తపోటు, మధుమేహం, ఒబెసిటీ, ధూమపానం, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు.. ఇలా ఇతర అంశాలపై కూడా ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. విటమిన్ డి లోపం వల్ల రికెట్స్, ఆస్టియోమలాసియా, ఆస్టియోపొరోసిస్, చర్మ వ్యాధులు, గుండె జబ్బులు (CVD) వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని
విటమిన్ డి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? : శరీరంలో ఆరోగ్యకరమైన విటమిన్ డి స్థాయిలను పెంపొందించుకోవడానికి జీవనశైలి, సరైన పోషకాహారం రెండూ అవసరమంటున్నారు నిపుణులు.
సూర్యరశ్మి : ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య రోజూ కనీసం 15-30 నిమిషాలు చర్మానికి ఎండ తగిలేలా చూసుకోవాలని
ఆహార అలవాట్లు : విటమిన్ డి ఎక్కువగా లభించే చేపలు, కోడిగుడ్డు, విటమిన్ డి ఉన్న ఫోర్టిఫైడ్ సెరల్స్, పాలను ఆహారంలో భాగంగా తీసుకోవాలంటున్నారు నిపుణులు. సాల్మన్, ట్యూనా, మాకేరెల్ వంటి కొవ్వు చేపలు విటమిన్ డికి చాలా మంచి వనరులని medlineplus పేర్కొంది.
సమతులాహారం : సంపూర్ణ ఆరోగ్యానికి మద్ధతుగా అన్ని పోషకాలు ఉండే సమతులాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.
సప్లిమెంట్లు : డాక్టర్లు సలహా మేరకు మాత్రమే విటమిన్ డి సప్లిమెంట్లను వాడాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, ఇది శరీరంలో మోతాదుకు మించితే నష్టం జరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి : విటమిన్ డి కేవలం ఎముకల ఆరోగ్యానికే కాకుండా, గుండె ఆరోగ్యంతో సహా శరీరంలోని పలు ముఖ్యమైన విధులకు ఎంతో అవసరమంటున్నారు నిపుణులు. శరీరంలో విటమిన్ డి స్థాయిలు తగ్గడానికి, గుండె జబ్బులు రావడానికి మధ్య ఉందని పరిశోధనలు సూచిస్తున్నప్పటికీ, గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అనేక అంశాలలో ఈ లోపం కేవలం ఒక భాగం మాత్రమే అని సూచిస్తున్నారు.
అయితే, క్రమం తప్పకుండా సూర్యరశ్మి తగలడం, పౌష్టికాహారం తీసుకోవడం, అవసరమైనప్పుడు డాక్టర్లు సలహాలు పాటించడం ద్వారా శరీరంలో ఆరోగ్యకరమైన విటమిన్ డి స్థాయిలను కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, సంపూర్ణ ఆరోగ్యానికి మద్దతుగా నిలవవచ్చని అంటున్నారు.
నోట్ : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.








