వెంకటరెడ్డి ఆశయాల సాధనకు కంకణబద్ధులై ఉద్యమిద్దాం: సీపీఎం నాయకుల పిలుపు
చింతూరు, సెప్టెంబర్ 6 (వై7 న్యూస్): గిరిజన ప్రజల హక్కుల కోసం జీవితాంతం పోరాడి, మన్య ప్రాంత అభివృద్ధికి విశేష కృషి చేసిన కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ శ్యామల వెంకటరెడ్డి 30వ వర్ధంతి కార్యక్రమం చింతూరు మండలంలోని ఏడుగురాళ్లపల్లిలో ఉన్న సీపీఎం కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జరిగిన వర్ధంతి సభలో సీనియర్ సీపీఎం నాయకులు ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, శాఖ కార్యదర్శి ఎస్కే షాజహాన్ మాట్లాడుతూ, శ్యామల వెంకటరెడ్డి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆదివాసీలకు అండగా నిలుస్తూ వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులను పరిచయం చేయడంతో పాటు, మారుమూల గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యాలు, ఆర్టీసీ బస్సు సేవలు, ఇతర మౌలిక వసతులు కల్పించేందుకు విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు.
మల్లంపేట వంటి దూర ప్రాంత గ్రామాలకు బీటీ రోడ్లు వేయించడం, ప్రజలకు రవాణా సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడం, ప్రభుత్వ సేవలను గ్రామీణ ప్రాంతాలకు చేర్చడంలో వెంకటరెడ్డి పాత్ర మరువలేనిదని కొనియాడారు.
గిరిజనుల భూ హక్కులు, పోడు భూముల పట్టాలు, తునికాకు బోనస్, వెదురు కార్మికుల కూలీల పెంపు వంటి అంశాలపై ఆయన నిరంతరం పోరాటాలు నిర్వహించారని తెలిపారు. ప్రజల చైతన్యానికి కృషి చేసిన నాయకుడిని మావోయిస్టులు కక్షపూరితంగా హత్య చేయడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
1996 సెప్టెంబర్ 6న పీపుల్స్ వార్ నక్సలైట్లు శ్యామల వెంకటరెడ్డిని హత్య చేశారని గుర్తుచేస్తూ, ఆయన భౌతికంగా లేకపోయినా పోరాట స్ఫూర్తి, ధైర్యసాహసాలు నేటి తరాలకు ఆదర్శంగా నిలిచాయని అన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి కార్యకర్త, ప్రజలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అంతకుముందు సీనియర్ నాయకుడు కోటేశ్వరరావు సీపీఎం పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం శ్యామల వెంకటరెడ్డి చిత్రపటానికి నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శివర్గ సభ్యులు మల్లం సుబ్బమ్మ, పొడియం లక్ష్మణ్, మండల కమిటీ సభ్యులు చింతా రాంబాబు, సవలం కన్నయ్య, నాయకులు పల్లపు పెద్దరాములు, సోడి దుర్గారావు, మడివి రాజేష్, సవలం దేశయ్య, ఆసు గణేష్, కోటేశ్వరరావు, పి.సుబ్బారావు, జయలక్ష్మి, ప్రియాంక, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.








