
చర్ల: చర్ల మండలం ఆర్.కొత్తగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని దానవాయిపేట గ్రామ ప్రాథమిక పాఠశాలలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులందరినీ సర్పంచ్ తుర్రం రవికుమార్, విద్యా కమిటీ చైర్మన్ కణితి రజని శాలువాలతో సత్కరించి, పూల మొక్కలను అందజేశారు. అనంతరం సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ తుర్రం రవికుమార్ మాట్లాడుతూ.. గురువు లేనిదే ఏ విద్యార్థి ఉన్నత శిఖరాలకు చేరుకోలేడని, తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు జీవితాన్ని తీర్చిదిద్దుతారని అన్నారు. పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న దానవాయిపేట పాఠశాల ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయుల సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
విద్యా కమిటీ చైర్మన్ కణితి రజని మాట్లాడుతూ.. మనం ఈరోజు ఏ స్థాయిలో ఉన్నా దాని వెనుక గురువుల కృషి ఉంటుందని అన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం, క్రమశిక్షణను నేర్పిస్తున్న ఉపాధ్యాయులకు పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు. గురువులను గౌరవించడం మన సంస్కృతిలో భాగమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ తుర్రం రవికుమార్, విద్యా కమిటీ చైర్మన్ కణితి రజని, బట్ట నాన్ రాజ్, చింతకాయల హరిబాబు, సుహాసిని, నీలిమ, అంగన్వాడీ టీచర్లు అనసూయ, రామంజమ్మ, దానవాయిపేట రుంజ రాజా, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.








