
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ పేదలు, రైతులు, విద్యార్థులు, మహిళలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక చారిత్రాత్మక కార్యక్రమాలను అమలు చేసిన గొప్ప ప్రజానాయకుడని కొనియాడారు.
వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేశాయని, ఆయన ఆశయాలు మరియు ప్రజా సంక్షేమ పాలన కాంగ్రెస్ పార్టీకి ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడిగా వైఎస్సార్ సేవలు చిరస్మరణీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకులు, మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, బూత్ మరియు గ్రామ కమిటీ అధ్యక్షులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళలు, యువకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.









