E-PAPER

వైఎస్సార్ పాలనలోనే సంక్షేమానికి పెద్దపీట: మాజీ మంత్రి అప్పలరాజు


పలాస, సెప్టెంబర్ 2 (వై7 న్యూస్): దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా పలాసలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు వైఎస్సార్ సేవలను స్మరించుకున్నారు. రాష్ట్రంలో పేదల సంక్షేమం, అభివృద్ధికి వైఎస్సార్ పాలనలోనే అత్యధిక ప్రాధాన్యత లభించిందని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత రెండున్నరేళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన అనేక మందికి కొత్త పెన్షన్లు అందడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం మూడు లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు ప్రకటించినప్పటికీ, పంచాయతీ స్థాయిలో చూస్తే ఒక్కో పంచాయతీకి కేవలం 10 నుంచి 20 పెన్షన్లు మాత్రమే మంజూరవుతున్నాయని విమర్శించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వైఎస్సార్ హయాంలో ప్రవేశపెట్టిన 108, 104 సేవలు, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలు పేదలకు ఎంతో మేలు చేశాయని గుర్తుచేశారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం పారిశ్రామిక పార్క్, రిమ్స్, మెడికల్ కాలేజీ, యూనివర్సిటీ, వంశధార ఫేజ్-2 ప్రాజెక్టు, హిరమండలం రిజర్వాయర్ వంటి కీలక అభివృద్ధి కార్యక్రమాలకు వైఎస్సార్ పాలనలోనే ప్రాధాన్యత లభించిందన్నారు.

అదేవిధంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఆఫ్‌షోర్ ప్రాజెక్టు, మూలపేట పోర్టు, బుడగట్లపాలెం హార్బర్, కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ వంటి ప్రాజెక్టులు ముందుకు సాగాయని తెలిపారు.

వెలిగొండ ప్రాజెక్టు, పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల విషయంలో ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని ఆయన తప్పుబట్టారు. వైఎస్సార్, జగన్ ప్రభుత్వాల హయాంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గుర్తించాలని కోరారు.

వైఎస్సార్ ఆశయాల స్ఫూర్తితో పేదలు, రైతులు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!