భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చోటీగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి, నర్స్ ఊకే శిరీష అనుమానాస్పద మృతి ఘటనపై భద్రాచలం బార్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. శిరీష మృతికి సంబంధించిన వాస్తవాలను వెలికితీసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాచలం జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు కాంప్లెక్స్ ప్రధాన ద్వారం వద్ద న్యాయవాదులు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొడాలి శ్రీనివాసన్, ఉపాధ్యక్షులు సున్నం రమేష్ నేతృత్వంలో జరిగిన ఈ నిరసనలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సమయంలో శిరీష అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం పలు సందేహాలకు తావిస్తోందని వారు పేర్కొన్నారు.
ఈ ఘటనపై ఎలాంటి రాజకీయ లేదా ఇతర ఒత్తిళ్లకు లోనుకాకుండా పోలీసులు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, సమగ్రంగా దర్యాప్తు జరపాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. శిరీష మృతి వెనుక ఉన్న అసలు కారణాలను బయటపెట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి తగిన న్యాయం చేయాలని, దర్యాప్తు పురోగతిపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించాలని బార్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
Post Views: 11









