ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న హారర్ మూవీ ‘418’ రిలీజ్కు సిద్ధమవుతున్న వేళ సెన్సార్ సమస్యల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సినిమాలోని హారర్ సన్నివేశాల తీవ్రతపై సెన్సార్ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో అనుకున్న సమయానికి సర్టిఫికేషన్ ప్రక్రియ పూర్తికాకపోవడంతో సినిమా విడుదలపై మరోసారి సస్పెన్స్ నెలకొంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘418’ చిత్రానికి ప్రశాంత్ నీల్ సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా, ఆయనతో కలిసి పనిచేసిన కీర్తన్ నాడగౌడ దర్శకత్వం వహించారు. ప్రీతి పగడాల, చరణ్ లక్కరాజు, సూర్య రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఓ విలేజ్ మెడికల్ కాలేజీ నేపథ్యంలో సాగే ఈ సినిమా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న తొలి పూర్తి స్థాయి హారర్ మూవీ కావడంతో ప్రేక్షకుల్లో మొదటి నుంచే ఆసక్తి నెలకొంది.
తాజా సమాచారం ప్రకారం, సెన్సార్ పరిశీలన సమయంలో కొన్ని భయానక సన్నివేశాల తీవ్రతపై అభ్యంతరాలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే మేకర్స్ వెంటనే మార్పులు చేయకుండా, సినిమాను మరోసారి పరిశీలించాలని కోరుతూ రివైజింగ్ కమిటీని ఆశ్రయించినట్లు సమాచారం. ఇప్పుడు రివైజింగ్ కమిటీ ఇచ్చే నిర్ణయంపైనే ‘418’ సెన్సార్ సర్టిఫికెట్, రిలీజ్ డేట్ ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది.








