భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆగస్టు 30:
నర్సు శీరీష మృతి ఘటనపై తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలేబోయిన వెంకటనారాయణ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న సానద్ ఉల్లా ఖాన్‌పై సమగ్ర, నిష్పక్షపాత దర్యాప్తు నిర్వహించి, నేరం రుజువైతే చట్ట ప్రకారం కఠిన శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వెంకటనారాయణ మాట్లాడుతూ, ఇతరుల ప్రాణాలను కాపాడే సేవా వృత్తిలో ఉన్న నర్సు శీరీష మృతి చెందడం అత్యంత విషాదకరమని అన్నారు. ఘటనపై ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించినా సహించబోమని హెచ్చరించారు.
శీరీష మృతికి సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఆయన కోరారు. సాక్ష్యాధారాల ఆధారంగా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆరోపణలు నిజమని తేలితే రాజకీయ లేదా ఇతర ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిందితుడికి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ న్యాయం చేయడంతో పాటు తగిన పరిహారం, భద్రత కల్పించాలని వెంకటనారాయణ కోరారు. అలాగే మహిళలు, నర్సులు మరియు రాత్రి వేళల్లో విధులు నిర్వహించే ఉద్యోగుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
శీరీష కుటుంబానికి న్యాయం జరిగే వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో తమ పోరాటం కొనసాగుతుందని తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలేబోయిన వెంకటనారాయణ స్పష్టం చేశారు.
రిపోర్టర్: దిలీప్ కుమార్








