నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. వినాశకర వరదల కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గల్లంతయ్యారు. తాజాగా నేపాల్‌లో వరదల ప్రభావం భారత్‌లోనూ కనిపిస్తోంది. వరదల్లో కొట్టుకుపోయిన మృతదేహాలు దిగువ ప్రాంతాల్లోని భారత నదుల్లోకి చేరుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
గత రెండు రోజుల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో నదుల్లో మొత్తం 10 మృతదేహాలు లభ్యమయ్యాయి. నేపాల్ నుంచి వరద నీటితో కొట్టుకొచ్చినవే ఈ మృతదేహాలు అయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. నేపాల్ సరిహద్దును ఆనుకుని ఉన్న మహారాజ్‌గంజ్, కుషీనగర్ జిల్లాల్లో గండక్ నదిలో ఆరు మృతదేహాలు గుర్తించారు. మృతుల వివరాలు, వారి కుటుంబ సభ్యుల ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది.
మహారాజ్‌గంజ్‌లో గురువారం నది ఉద్ధృత ప్రవాహంలో మూడు మృతదేహాలను గుర్తించారు. వారిలో ఇద్దరు మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. నది పరిసర ప్రాంతాల్లో గస్తీ నిర్వహిస్తున్న సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ) రెస్క్యూ బృందాలు మృతదేహాలను వెలికితీసి మార్చురీకి తరలించాయి. మృతదేహాలను గుర్తించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.









