
కరకగూడెం, ఆగస్టు 27 (Y7 తెలుగు న్యూస్): కరకగూడెం మండలంలోని జెడ్పీహెచ్ఎస్ భవిత పాఠశాలలో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న దివ్యాంగ బాల బాలికలకు మండల స్థాయి క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఐఈఆర్టీ ఉపాధ్యాయురాలు జి. విజయకుమారి ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) గడ్డం మంజుల క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు సహా అన్ని రంగాల్లో రాణించే సామర్థ్యం కలిగి ఉన్నారని అన్నారు. వారికి సరైన ప్రోత్సాహం అందిస్తే మరింత ప్రతిభ కనబరుస్తారని పేర్కొన్నారు.
కరకగూడెం పోలేబోయిన గ్రామ సర్పంచ్ సుజాత మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి విద్యతో పాటు క్రీడల్లోనూ విశేష ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు కుర్చీ ఆట, పరుగు పందెం, స్పూన్ రేస్ తదితర క్రీడా పోటీలను నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. వివిధ విభాగాల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు.
కార్యక్రమంలో భట్టుపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మోహన్‌బాబు, కరకగూడెం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, సీఆర్పీ సాంబశివరావు, ప్రత్యేక విద్యా సిబ్బంది, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
– రిపోర్టర్ దిలీప్ కుమార్








