ఉత్తర నేపాల్‌లో బుధవారం ఉదయం సంభవించిన ఆకస్మిక మెరుపు వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో సరిహద్దు ప్రాంతాల్లోని పలు గ్రామాలు పూర్తిగా కొట్టుకుపోయాయి. భారీ నీటి ప్రవాహానికి ఇళ్లు, వంతెనలు, మార్కెట్ ప్రాంతాలు నీటమునిగిపోగా.. పలు జలవిద్యుత్ ప్రాజెక్టులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మరోవైపు వందల సంఖ్యలో ప్రజలు గల్లంతైనట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వరదల ధాటికి రహదారులు, వంతెనలు దెబ్బతినడంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. అయితే దెబ్బతిన్న రహదారులు, వంతెనలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుండటంతో ఈ విపత్తులో జరిగిన పూర్తి ప్రాణ, ఆస్తి నష్టం ఎంత అనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది.








