అశ్వారావుపేట, ఆగస్టు 22: ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ చేపట్టిన “ప్రతి రోజు ప్రజాపాలన” కార్యక్రమం శనివారం గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి అశ్వారావుపేట నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను ఎమ్మెల్యే స్వీకరించారు. భూ సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, తాగునీరు, రహదారులు, విద్యుత్, రెవెన్యూ సంబంధిత అంశాలతో పాటు వ్యక్తిగత సమస్యలపై ప్రజలు వినతిపత్రాలు అందజేశారు.
దరఖాస్తులను పరిశీలించిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, వెంటనే పరిష్కారం సాధ్యమయ్యే సమస్యలపై సంబంధిత శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా సమస్యలను వేగంగా పరిష్కరించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రతి వినతిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యే వరకు నిరంతరం పర్యవేక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.








