తమిళనాడు ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం (CMCHIS) కింద లబ్ధిదారులకు అందే వార్షిక బీమా పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు సీఎం సి. జోసెఫ్ విజయ్ అసెంబ్లీలో ప్రకటించారు. ఆదాయంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యమని తెలిపారు.
పాడి రైతుల సంక్షేమం కోసం ఆవిన్ పాల సేకరణ ధరను లీటరుకు రూ.38 నుంచి రూ.41కు పెంచుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం ఉన్నప్పటికీ రాష్ట్రంలోని 3.16 లక్షల మందికి పైగా పాడి రైతులకు ప్రయోజనం కలిగేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు.
అలాగే ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పర్యటించేందుకు ప్రభుత్వ వాహనాలతో పాటు డ్రైవర్, ఇంధనం, వాహన నిర్వహణ ఖర్చుల కోసం నెలకు రూ.75,000 ప్రత్యేక అలవెన్స్‌ను కేటాయించనున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు.








