నీట్ (NEET UG) పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రతపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, జాతీయ పరీక్షల సంస్థ (NTA) సుప్రీంకోర్టుకు కీలక వివరాలు వెల్లడించాయి. పేపర్ లీకేజీలు, అవకతవకలను అరికట్టేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు అమలు చేస్తున్నామని తెలిపాయి. నిపుణులు ఉమ్మడిగా క్వశ్చన్ బ్యాంక్‌ను రూపొందిస్తారని, తుది పరీక్షా పత్రంలో ఏ ప్రశ్నలు ఎంపికవుతాయనే విషయం వారికి కూడా ముందుగా తెలియదని వివరించాయి.
ప్రశ్నపత్రాల రవాణా వాహనాలకు జీపీఎస్ వ్యవస్థలను అమర్చి, వాటి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు NTA తెలిపింది. సైబర్ భద్రత కోసం ఇంటర్నెట్కు అనుసంధానం లేని ‘ఎయిర్-గ్యాప్డ్ సిస్టమ్స్’, సీక్రెట్ రూమ్‌లను ఉపయోగిస్తున్నట్లు వెల్లడించింది. పరీక్షా వ్యవస్థలో సంస్థాగత మార్పులు అవసరమని సూచించిన రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులతో సుప్రీంకోర్టు కూడా ఏకీభవించింది.
NEET సంస్కరణలకు సంబంధించి రాధాకృష్ణన్ ప్యానెల్, నందన్ నీలేకని కమిటీ చేసిన సిఫార్సుల అమలుపై అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు NTAను ఆదేశించింది. ఇప్పటికే పరీక్షా వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా 50 మందికి పైగా సిబ్బందిని విధుల నుంచి తొలగించినట్లు NTA తెలిపింది. సైబర్ సెక్యూరిటీ, సైకోమెట్రిక్స్, క్వశ్చన్ పేపర్ డిజైనింగ్ వంటి విభాగాల్లో ప్రైవేట్ రంగ నిపుణుల సేవలను కూడా వినియోగిస్తున్నట్లు వెల్లడించింది.








