తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, వివాదాల నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అత్యవసర సమావేశం నిర్వహించింది. పరిశ్రమలో క్రమశిక్షణను కాపాడే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారంపై చర్చించిన ఫెడరేషన్.. ఆయనపై గతంలో విధించిన సస్పెన్షన్ ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతుందని స్పష్టం చేసింది.
జానీ మాస్టర్ గతంలో ఫెడరేషన్‌కు అందజేసిన రూ.3 లక్షల మొత్తాన్ని తిరిగి ఆయనకే పంపుతున్నట్లు ప్రకటించింది. డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత వ్యవహారశైలిపై కౌన్సిల్ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం నెలకొన్న వివాదాల నేపథ్యంలో డ్యాన్సర్స్ అసోసియేషన్ మినహా పరిశ్రమలోని మిగిలిన 24 శాఖల సంఘాలకు ఫెడరేషన్ పూర్తి మద్దతు ఉంటుందని వెల్లడించింది.
చిత్ర పరిశ్రమలో నిబంధనలు ఉల్లంఘించే వారిని, క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించే వారిని ఏమాత్రం సహించబోమని ఫిల్మ్ ఫెడరేషన్ స్పష్టం చేసింది. కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, పరిశ్రమలో క్రమశిక్షణకు తాము కట్టుబడి ఉంటామని పునరుద్ఘాటించింది. తాజా నిర్ణయాలు టాలీవుడ్లో ఎలాంటి మార్పులకు దారితీస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.








