E-PAPER

ఇన్‌పుట్ డీలర్లు రైతులకు సాంకేతిక సహాయకులుగా పనిచేయాలి: కలెక్టర్ అంకిత్


చుంచుపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి లో రైతులకు వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరవేసే కీలక వారధులుగా ఇన్‌పుట్ డీలర్లు పనిచేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. చుంచుపల్లి రైతు వేదికలో బుధవారం దేశీ శిక్షణ కోర్సు పూర్తి చేసుకున్న 39 మంది ఇన్‌పుట్ డీలర్లకు డిప్లొమా సర్టిఫికెట్లు అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతికత, శాస్త్రీయ సాగు విధానాలు, ప్రత్యామ్నాయ పంటల సాగు వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ వారి ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించడంతో పాటు ఆయిల్‌పామ్, కూరగాయలు, మిరప వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులను ప్రోత్సహించాలని సూచించారు.

ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో 37 శాతం వర్షాభావం నమోదైందని, చెరువుల్లో నీటి నిల్వలు కూడా తక్కువగా ఉన్న నేపథ్యంలో నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ఎంపికపై రైతులకు సరైన సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. భూసార పరిరక్షణ, సేంద్రియ కర్బన పెంపు, మట్టి పరీక్షలు, నీటి వినియోగ సామర్థ్యంపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.

వ్యవసాయ శాఖ, నీటిపారుదల, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ రైతులకు అవసరమైన సాంకేతిక సహకారం అందించాలని ఇన్‌పుట్ డీలర్లకు సూచించారు. ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న విత్తనాలను సద్వినియోగం చేసుకునేలా రైతులకు మార్గనిర్దేశం చేయాలని తెలిపారు.

వ్యవసాయ శాఖ అధికారి బాబురావు మాట్లాడుతూ, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.

దేశీ శిక్షణలో ప్రతిభ కనబరిచిన గుడిపాటి విజయభాస్కర్‌కు గోల్డ్ మెడల్, అనగారి కళ్యాణ్‌కు సిల్వర్ మెడల్ అందజేసిన కలెక్టర్ వారిని అభినందించారు. అనంతరం సబ్సిడీ విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు.

తహసీల్దార్ కార్యాలయంపై ఆకస్మిక తనిఖీ

కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ అంకిత్ చుంచుపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించి ప్రజలకు అందుతున్న రెవెన్యూ సేవలు, పెండింగ్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ముఖ్యంగా భూ భారతి, సాదా బైనామా కింద వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు. మొత్తం వచ్చిన దరఖాస్తులు, పరిష్కరించినవి, పరిశీలనలో ఉన్నవి, పెండింగ్‌లో ఉన్నవాటి వివరాలను రికార్డుల ఆధారంగా పరిశీలించారు.

పెండింగ్‌లో ఉన్న ప్రతి దరఖాస్తును కేసుల వారీగా పరిశీలించి, ఆలస్యానికి గల కారణాలను గుర్తించి సకాలంలో పరిష్కరించాలని తహసీల్దార్ నాగరాజుకు సూచించారు. భూ రికార్డులు, హక్కులు, సంబంధిత పత్రాలను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు వంటి సేవలకు వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. ప్రజల సమస్యలను పారదర్శకంగా, వేగవంతంగా పరిష్కరించడం రెవెన్యూ అధికారుల బాధ్యత అని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీవో సుభాషిని, ఫెసిలిటేటర్ డేవిడ్ జైపాల్ రావు, వ్యవసాయ శాఖ అధికారులు, ఇన్‌పుట్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!