ములకలపల్లి: గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎండీ యూసఫ్ డిమాండ్ చేశారు. కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి, వారి ఉద్యోగ భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ములకలపల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన రెండు రోజుల రిలే నిరాహార దీక్షలకు ఎండీ యూసఫ్ హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల పారిశుద్ధ్యం, నిర్వహణతో పాటు ప్రజలకు అవసరమైన అనేక సేవల్లో కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారి సమస్యలు దీర్ఘకాలంగా పరిష్కారం కాకపోవడం బాధాకరమన్నారు.
కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు. సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కార్మిక సంఘాలను ఏకం చేసి ప్రభుత్వంపై మరింత ఉధృతంగా పోరాటం చేపడతామని హెచ్చరించారు.
ఏఐటీయూసీ మండల కార్యదర్శి ఎస్కే జబ్బార్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికుల పోరాటానికి ఏఐటీయూసీ మండల కమిటీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణమే చర్చలు జరిపి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ నిమ్మల మధు, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి గంటా శ్రీనివాసరావు, వర్క రుక్మధరావు, మేకల రమేష్, సాయి రత్న, శనగాని వెంకన్న, సుజాత, కుంజా శ్రీను, గుగులోతు శంకర్, యేసు బాబు తదితరులు పాల్గొన్నారు.








