
ఏటూరునాగారం: ఐటీడీఏ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కావెంజర్లకు విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా నెలకు రూ.10 వేల వేతనం చెల్లించాలని పాఠశాల స్కావెంజర్ల సంఘం డిమాండ్ చేసింది. స్కావెంజర్లతో వెట్టి చాకిరీ చేయించకుండా ప్రభుత్వం వేతనాలు చెల్లించాలని కోరారు.
సోమవారం ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాంగణంలో పాఠశాల స్కావెంజర్ల సమావేశం సంఘం జిల్లా అధ్యక్షురాలు గడ్డం భారతి అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఐటీడీఏ పీఓకు అందజేశారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్లకు వేతనాలు చెల్లిస్తూ స్కావెంజర్ వ్యవస్థను కొనసాగిస్తున్నారని తెలిపారు. అయితే ఐటీడీఏ పరిధిలోని పాఠశాలల్లో మాత్రం స్కావెంజర్లకు వేతనాలు చెల్లించకుండా మధ్యాహ్న భోజనం తయారు చేసే వంట కార్మికులతోనే పారిశుద్ధ్య పనులు చేయించడం సరికాదన్నారు.
ఐటీడీఏ పీఓ స్పందించి పాఠశాల స్కావెంజర్లకు వెంటనే వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే సెప్టెంబర్ 1 నుంచి వంట కార్మికులు కేవలం వంట పనులు మాత్రమే చేస్తారని, వెట్టి చాకిరీ చేయబోరని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఐటీడీఏ ఉపాధ్యాయులు కూడా అర్థం చేసుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో పోరెడ్డి ప్రమీల, పూలక్క, రమ, పద్మ, సమ్మయ్య, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.








