ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన స్నేహం ఏడాది ప్రేమగా మారి చివరకు పెళ్లికి దారితీసింది. అయితే కొత్త జీవితాన్ని ప్రారంభించిన కొన్ని గంటల్లోనే 19 ఏళ్ల నవవధువు మరణించడంతో ఈ ప్రేమకథ విషాదంగా ముగిసింది. ఈ ఘటన బీహార్లోని పూర్నియా జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం, 19 ఏళ్ల యువతి తన కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా ప్రియుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. సోమవారం పూర్నియా జంక్షన్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో వారిద్దరూ వివాహం చేసుకుని భార్యాభర్తలుగా ఒకరినొకరు అంగీకరించారు.
పెళ్లి జరిగిన కొద్ది గంటల్లోనే యువతి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు యువతి భర్తను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. యువతి మరణానికి గల ఖచ్చితమైన కారణం పోస్టుమార్టం నివేదిక అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.








