ప్రముఖ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. గతంలో తాను ఒక టాక్సిక్ రిలేషన్‌లో ఉన్నానని, ఆ బంధంలో ఉన్నంత కాలం ప్రతి క్షణం భయం, ఆందోళనతో గడిచిందని ఆమె వెల్లడించారు. సాధారణంగా మాట్లాడే విషయాలకే వందసార్లు ఆలోచించాల్సి వచ్చేదని, ఆ సంబంధం తన మానసిక ప్రశాంతతను దెబ్బతీసిందని అనుపమ పేర్కొన్నారు.
ఇరు కుటుంబాలు కలవడం, కలిసి సమయం గడపడం వల్ల ఆ వ్యక్తితోనే జీవితాన్ని ఊహించుకున్నానని, కానీ తర్వాత అసలు స్వభావం బయటపడిందని ఆమె తెలిపారు. తన కెరీర్, వ్యక్తిగత నిర్ణయాలపై అధిక నియంత్రణ ఉండేదని, అందువల్ల పలు మంచి అవకాశాలను కూడా కోల్పోవాల్సి వచ్చిందని చెప్పారు. తన కుటుంబం, స్నేహితుల నుంచి కూడా క్రమంగా దూరమయ్యానని ఆమె భావోద్వేగంగా వివరించారు.
తనపై ఎంత ప్రభావం పడుతున్నప్పటికీ, ఒక దశలో ఆ వ్యక్తినే కుటుంబ సభ్యుల నుంచి కాపాడేందుకు ప్రయత్నించానని అనుపమ చెప్పారు. బయట ఎవరైనా ఆప్యాయంగా మాట్లాడినా భావోద్వేగానికి లోనయ్యేదాన్నని ఆమె పేర్కొన్నారు. అనుపమ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీస్తుండగా, ఈ వ్యవహారంపై అవతలి వ్యక్తి స్పందన ఎలా ఉంటుందన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.








