పలాస, ఆగస్టు 7 (వై7 న్యూస్): పేద, మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరలో అందించాలనే లక్ష్యంతో పలాస రైతు బజార్లో ఏర్పాటు చేసిన మిల్లు అవుట్లెట్ స్టోర్‌ను పలాస ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే 10 కిలోల నాణ్యమైన బియ్యాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రజల ఆహార భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు నాణ్యమైన బియ్యం సులభంగా అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.
రైతు బజార్లో ఏర్పాటు చేసిన మిల్లు అవుట్లెట్ స్టోర్ ద్వారా వినియోగదారులు తక్కువ ధరకే మంచి నాణ్యత కలిగిన బియ్యాన్ని కొనుగోలు చేసుకునే అవకాశం కలుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.
అనంతరం పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే గౌతు శిరీష బియ్యం పంపిణీ చేసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మిల్లు యజమానులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.








