థాయ్‌లాండ్‌లోని ఓ పాఠశాలలో శుక్రవారం ఉదయం జరిగిన కాల్పుల ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ దాడిలో ఓ ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. కాల్పులకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వ్యక్తి అదే పాఠశాలకు చెందిన విద్యార్థి అని గుర్తించిన అధికారులు, దాడి అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం, గాయపడిన వారిలో ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. మిగిలిన బాధితుల వివరాలు, వారి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం ఇంకా వెల్లడించాల్సి ఉంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటన థాయ్‌లాండ్‌లోని బాంగ్ క్రూయై జిల్లాలో ఉన్న డెబ్సిరిన్ నోంతాబురి పాఠశాలలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే ప్లాయ్ బ్యాంగ్ పోలీస్ స్టేషన్ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పాఠశాల ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.








