డెన్మార్క్ రాజకుటుంబానికి చెందిన 19 ఏళ్ల ప్రిన్సెస్ ఇసబెల్లా సైనిక సేవలో చేరి చరిత్ర సృష్టించారు. పూర్తి స్థాయి తప్పనిసరి సైనిక శిక్షణలో చేరిన డెన్మార్క్ రాజకుటుంబంలోని తొలి మహిళగా ఆమె నిలిచారు. కింగ్ ఫ్రెడరిక్ X, క్వీన్ మేరీ దంపతుల పెద్ద కుమార్తె అయిన ఇసబెల్లా ఆగస్టు 3న స్లాగెల్సేలోని ఆంట్వోర్స్కోవ్ బ్యారక్స్‌లో 11 నెలల మిలటరీ శిక్షణను ప్రారంభించారు.
హైస్కూల్ విద్య పూర్తైన కొద్ది వారాలకే సైనిక సేవలో చేరిన ఇసబెల్లా తన నిరాడంబర వైఖరితో అందరి దృష్టిని ఆకర్షించారు. ఎలాంటి ప్రత్యేక హంగూ ఆర్భాటం లేకుండా స్వయంగా నల్లటి SUV కారును నడుపుకుంటూ బ్యారక్స్‌కు చేరుకున్నారు. బ్యాగీ జీన్స్, స్వెడ్ జాకెట్ ధరించి, పెద్ద బ్యాక్‌ప్యాక్‌తో పాటు చిన్న హ్యాండ్‌బ్యాగ్‌తో సాధారణ యువతిలా కనిపించారు.
బ్యారక్స్ ప్రవేశద్వారం వద్ద విధుల్లో ఉన్న భద్రతా సిబ్బందికి తన గుర్తింపు కార్డును చూపించిన అనంతరం, అక్కడ ఉన్న జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లకు చిరునవ్వుతో అభివాదం చేసి నేరుగా లోపలికి వెళ్లిపోయారు. రాజకుమార్తెగా కాకుండా సాధారణ శిక్షణార్థిలా సైనిక సేవను ప్రారంభించిన ఇసబెల్లా తీరు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.








