అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’ హెలికాప్టర్‌కు ఓ ప్యాసింజర్ విమానం అనుమతించిన పరిమితికి మించి చేరువ కావడంతో అమెరికాలో కలకలం రేగింది. వాషింగ్టన్‌లోని రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో జరిగిన ఈ ఘటనపై అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) దర్యాప్తు ప్రారంభించింది. అయితే రెండు విమానాలు ఢీకొనే ప్రమాదం తలెత్తలేదని అధికారులు స్పష్టం చేశారు.
ఆగస్టు 4న మధ్యాహ్నం ట్రంప్ ప్రయాణిస్తున్న మెరైన్ వన్ హెలికాప్టర్ వైట్ హౌస్ సమీపంలోని ఎలిప్స్ ప్రాంతం నుంచి జాయింట్ బేస్ ఆండ్రూస్‌కు బయలుదేరింది. అదే సమయంలో రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి అమెరికన్ ఎయిర్‌లైన్స్ అనుబంధ సంస్థ ఎన్వాయ్ ఎయిర్ నిర్వహిస్తున్న ఎంబ్రాయర్ E-170 ప్యాసింజర్ విమానం టేకాఫ్ అయింది. ఈ రెండు విమానాలు కొద్దిసేపు అనుమతించిన భద్రతా దూరానికి లోపలికి వచ్చినట్లు FAA తెలిపింది.
అయితే పరిస్థితిని వెంటనే నియంత్రించడంతో రెండు విమానాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ప్రయాణాన్ని సురక్షితంగా కొనసాగించాయి. ఘటనకు దారితీసిన కారణాలపై FAA సమగ్ర విచారణ చేపట్టగా, విమాన భద్రతా నిబంధనల అమలుపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.








