పలాస , ఆగస్టు 6 ( వై7 న్యూస్ );
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం సైనూరు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమం కింద రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పాస్ పుస్తకాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ రాజముద్రతో జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలు భూ యాజమాన్యానికి చట్టబద్ధమైన ధ్రువపత్రాలుగా ఉపయోగపడతాయని చెప్పారు. వీటి ద్వారా రైతులు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ సబ్సిడీలు, పంట నష్టపరిహారం వంటి ప్రయోజనాలను సులభంగా పొందగలరని పేర్కొన్నారు.
గ్రామాల్లో భూ సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని రెవెన్యూ, సర్వే అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు, గ్రామ సర్పంచ్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.








