
నిరంజన్–సౌజన్య దంపతుల సేవా కార్యక్రమానికి ప్రశంసలు
చర్ల, ఆగస్టు 3 (వై7 న్యూస్): చర్ల మండలంలోని రాళ్లపురం గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నిరంజన్–సౌజన్య దంపతులు కొత్త దుస్తులను పంపిణీ చేసి తమ సేవా భావాన్ని చాటుకున్నారు. గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు చెందిన చిన్నారులకు దుస్తులు అందజేయడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని గ్రామస్తులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందించారు.
ఈ సందర్భంగా నిరంజన్–సౌజన్య దంపతులు మాట్లాడుతూ, రాళ్లపురం గ్రామ విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి తమ మిత్రుడు మద్ది లక్ష్మీనరసింహారెడ్డి ద్వారా తెలుసుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. చిన్నారుల విద్యాభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రోత్సాహం, సహకారం అందితే వారు ఉన్నత స్థాయికి చేరుకుంటారని చెప్పారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ తమకు సాధ్యమైన మేరకు పేద విద్యార్థులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో కూడా విద్య, ఆరోగ్యం, సామాజిక సేవలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించి అవసరమైన వారికి తోడ్పాటు అందిస్తామని వెల్లడించారు.
చర్ల మండల యువ నాయకులు బోరా పెద్దిరెడ్డి, పరిటాల సంతోష్ మాట్లాడుతూ, విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. నిరంజన్–సౌజన్య దంపతులు మరింత మంది పేద విద్యార్థులకు సహాయం అందించాలని ఆకాంక్షించారు.
దుస్తులు అందుకున్న విద్యార్థులు దాతలకు కృతజ్ఞతలు తెలియజేయగా, గ్రామస్తులు ఈ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ మరింత మంది దాతలు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు షబీనా, మద్ది లక్ష్మీనరసింహారెడ్డి, గడ్డం సాయి, సృజన్, కొట్టే నవీన్, మూషిక ప్రవీణ్, బాలరాజు, అంగయ్య, భీమయ్య, ఉంగయ్య, గ్రామస్తులు, తల్లిదండ్రులు, యువకులు పాల్గొన్నారు









