అస్సాంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని తీవ్రంగా అతలాకుతలం చేస్తున్నాయి. అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ASDMA) తాజా నివేదిక ప్రకారం, శివసాగర్ జిల్లాలో ఇద్దరు, గోలాఘాట్ జిల్లాలో ఒకరు మృతిచెందడంతో వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 78కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో మూడు లక్షల మందికిపైగా ప్రజలు వరద ప్రభావంతో ఇబ్బందులు పడుతున్నారు. 21 రెవెన్యూ సర్కిళ్ల పరిధిలోని 551 గ్రామాలు నీటమునగగా, సుమారు 21,523 హెక్టార్ల వ్యవసాయ భూమి దెబ్బతింది.
చరాయిదేవు జిల్లా అత్యంత తీవ్రంగా ప్రభావితమై, అక్కడ 1.37 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. శివసాగర్, జోర్హాట్ జిల్లాల్లో కూడా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రస్తుతం 71 పునరావాస కేంద్రాల్లో 16,500 మందికిపైగా ఆశ్రయం పొందుతుండగా, మరో 72 వేల మందికి 30 సహాయ కేంద్రాల ద్వారా నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు. వరదల కారణంగా రహదారులు, పాఠశాలలు, ఇతర మౌలిక వసతులు దెబ్బతినడంతో పాటు 11 వేలకుపైగా పశువులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. గువాహటి నగరంతో పాటు కామరూప్ మెట్రోపాలిటన్ జిల్లాలో పట్టణ వరదల సమస్య ఇంకా కొనసాగుతోంది.
వరద పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో ఫోన్‌లో మాట్లాడి సహాయక చర్యలను సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో భారత వాతావరణ శాఖ (IMD) జులై 30 నుంచి ఆగస్టు 1 వరకు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్‌లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తీన్‌సుకియా సహా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో సహాయక బృందాలు, విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తంగా ఉన్నాయి.









