పలాస, జూలై 28 (వై7 న్యూస్): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పలాస మండలం సవర గోవిందపురం గ్రామంలో “ఇంటి ఇంటికి తెలుగుదేశం” కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. అలాగే గ్రామ ప్రజల సమస్యలు, సూచనలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న “తల్లికి వందనం” పథకం ద్వారా విద్యార్థులకు ఆర్థిక సహాయం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, “అన్నదాత సుఖీభవ” ద్వారా రైతులకు పెట్టుబడి సాయం, ఎన్టీఆర్ భరోసా పథకం కింద వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, డయాలసిస్ బాధితులకు అందిస్తున్న ఆర్థిక సహాయంపై ప్రజలకు అవగాహన కల్పించారు.
అలాగే రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, ఉపాధి అవకాశాల కల్పన, గ్రామాలు మరియు పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరించారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక పరిశీలకులు, డీసీఎంఎస్ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి, ఏఎంసీ చైర్మన్ మల్ల శ్రీనివాసరావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పీరికట్ల విట్టల్, పలాస మండల అధ్యక్షులు కుత్తుం లక్ష్మణ్, కార్యదర్శి దువ్వాడ సంతోష్ నాయుడు, క్లస్టర్ కన్వీనర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.








