చర్ల మండలం, బక్కచింతలపాడు:
ఎన్నో సంవత్సరాలుగా చెక్కలు, వెదురుతో నిర్మించిన గుడిసె తరహా భవనంలో కొనసాగిన గ్రామ ప్రాథమిక పాఠశాల ఇటీవల ఆ భవనం నుంచి బయటకు వచ్చి రేకుల షెడ్డు, ఇటుక గోడలతో ఏర్పాటు చేసిన తాత్కాలిక భవనంలోకి మారింది. గుడిసెతో పోలిస్తే ప్రస్తుతం కొంత మెరుగైన పరిస్థితులు ఉన్నప్పటికీ, ఇది శాశ్వత పరిష్కారం కాదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికీ చిన్నారులు ఆర్‌సీసీ పక్కా పాఠశాల భవనం లేకుండా రేకుల షెడ్డు కిందే విద్యాభ్యాసం కొనసాగించాల్సి వస్తోంది. ఎండాకాలంలో తీవ్రమైన వేడి, వర్షాకాలంలో అసౌకర్యం వంటి సమస్యలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉందని తల్లిదండ్రులు చెబుతున్నారు.
స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు కనీస మౌలిక వసతులతో కూడిన శాశ్వత పాఠశాల భవనం కూడా అందుబాటులో లేకపోవడం బాధాకరమని గ్రామస్థులు పేర్కొంటున్నారు. తక్షణమే అన్ని సౌకర్యాలతో కూడిన ఆర్‌సీసీ పాఠశాల భవనాన్ని నిర్మించాలని, తాగునీరు, మరుగుదొడ్లు, ఆటస్థలం, అదనపు తరగతి గదులు వంటి వసతులను కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.









