E-PAPER

సీతమ్మసాగర్–సీతారామ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తాం

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను పుష్కలంగా అందిస్తాం: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

అశ్వాపురం, జూలై 16 (వై7 న్యూస్):
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సాగు, తాగునీటి అవసరాలను తీర్చే కీలకమైన సీతమ్మసాగర్ బ్యారేజ్, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్ వద్ద నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం నీటిపారుదల శాఖ అధికారులు మ్యాప్‌లు, సాంకేతిక నమూనాల ద్వారా ప్రాజెక్టు పురోగతి, మిగిలిన పనులు, అవసరమైన నిధులు, పంప్‌హౌస్‌లు, కాలువలు, విద్యుత్ అనుసంధానం తదితర అంశాలను మంత్రులకు వివరించారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ గోదావరి నదీ జలాలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో గ్రావిటీ ద్వారా, అవసరమైన చోట్ల ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని తరలించేలా ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రాజెక్టుపై భారీగా ప్రజాధనం ఖర్చు అయినందున మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసి రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అత్యంత కీలకమైన సాగునీటి పథకమని పేర్కొన్నారు. ప్రాజెక్టులోని పంప్‌హౌస్‌లు, బ్యారేజ్, కాలువలు, విద్యుత్ అనుసంధానం వంటి పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన న్యాయపరమైన సమస్యలను పరిష్కరించి త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత సుమారు 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు వెల్లడించారు.

రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గోదావరి జలాలు సముద్రంలో వృథాగా కలిసిపోకుండా నీటి వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుకు అవసరమైన ఎలక్ట్రికల్, మెకానికల్ పనుల కోసం రూ.1,000 కోట్లకు పైగా నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించడంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందన్నారు.

జిల్లా కలెక్టర్ అంకిత్ ప్రాజెక్టు పనుల పురోగతి, భూసేకరణ, పునరావాసం, విద్యుత్ అనుసంధానం, మౌలిక సదుపాయాల కల్పనపై మంత్రులకు వివరించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనులు పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు.

అనంతరం మంత్రులు మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులను కూడా పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, వైరా ఎమ్మెల్యే రామదాసు నాయక్, టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యా చందన, నీటిపారుదల శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News