జూలై 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈసారి తీవ్ర రాజకీయ వేడిని రగిలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం జరుగుతున్న ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ సమగ్ర వ్యూహాన్ని సిద్ధం చేసింది. అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలు, విద్యా వ్యవస్థలో అవ్యవస్థలు, అవినీతి, ధరల పెరుగుదల, విదేశాంగ విధానంపై ప్రశ్నలు లేవనెత్తాలని నిర్ణయించింది.
అంతేకాకుండా నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్), మంత్రులు, ముఖ్యమంత్రుల తొలగింపుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లులను కూడా కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ అంశాలపై పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని నిలదీయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ నివాసం 10 జనపథ్‌లో కీలక వ్యూహ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, పి. చిదంబరం, శశి థరూర్, మనీష్ తివారీ, కుమారి సెల్జా, తారిక్ అన్వర్ తదితర సీనియర్ నేతలు పాల్గొని పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.








