మనం రోజూ తినే ఆహారం నిజంగా సురక్షితమేనా? అనే ప్రశ్నతో టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే సోషల్ మీడియాలో కొత్త అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాము నటిస్తున్న ‘ది ఇండియా స్టోరీ’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా #WhatsOnYourPlate పేరుతో ఈ వినూత్న ఛాలెంజ్‌ను మొదలుపెట్టి, ఆహారంలో పురుగుమందుల కల్తీపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు.
ఈ ఛాలెంజ్‌లో భాగంగా కాజల్ తన భోజనం పళ్లెం ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, మనం తినే ఆహారం నాణ్యతపై ఆలోచించాలని కోరారు. అలాగే ఈ ఉద్యమాన్ని మరింత విస్తరించేందుకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సమంత రూత్ ప్రభు, రకుల్ ప్రీత్ సింగ్‌లను నామినేట్ చేశారు. మరోవైపు శ్రేయాస్ తల్పాడే కూడా ప్రతి ఒక్కరూ ఈ సవాల్‌లో పాల్గొని తమ భోజనం ఫోటోలను షేర్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
వ్యవసాయంలో అధికంగా వాడుతున్న పురుగుమందులు, రసాయనాల వల్ల ప్రజల ఆరోగ్యంపై పడుతున్న ప్రభావాన్ని ‘ది ఇండియా స్టోరీ’ సినిమాలో ప్రధానాంశంగా చూపించనున్నారు. వినోదంతో పాటు సామాజిక సందేశాన్ని అందించే ఈ సోషియో-రియలిస్టిక్ డ్రామా జూలై 24, 2026న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.








