అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఏర్పాటు చేసిన ఓ బిల్‌బోర్డు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఆ బిల్‌బోర్డులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శవపేటికలో ఉన్నట్లుగా చిత్రీకరిస్తూ, ఆయనను లక్ష్యంగా చేసుకున్న బెదిరింపు సందేశాన్ని ఇంగ్లీష్, పర్షియన్ భాషల్లో ప్రదర్శించారు. ఈ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తోంది.
బిల్‌బోర్డులో ట్రంప్ కళ్లూ, నోరూ మూసుకుని శవపేటికలో ఉన్నట్లు చూపించగా, దానికి సమీపంలో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ చిత్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇరాన్‌లో రాజకీయ, జాతీయ అంశాలపై ప్రజలకు సందేశాలు చేరవేయడానికి ఇలాంటి భారీ బిల్‌బోర్డులను తరచుగా ఉపయోగిస్తుంటారు.
ప్రస్తుతం టెహ్రాన్‌తో పాటు ఇతర ప్రధాన నగరాల్లో కూడా అమెరికా, ఇజ్రాయిల్‌కు వ్యతిరేక నినాదాలు, పోస్టర్లు, బిల్‌బోర్డులు కనిపిస్తున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఈ పరిణామం అంతర్జాతీయ స్థాయిలో మరింత చర్చకు దారితీసింది.








