భారతీయ చిత్రాలకు ప్రస్తుతం అమలులో ఉన్న సెన్సార్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డిమాండ్ చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, స్మార్ట్‌ఫోన్లు, ఓటీటీలు, సోషల్ మీడియా, అంతర్జాతీయ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులో ఉన్న ఈ డిజిటల్ యుగంలో సినిమాలపై సెన్సార్ విధించడం ప్రేక్షకులను అవమానించడమేనని విమర్శించారు. 18 ఏళ్ల యువకుడు దేశ నాయకుడిని ఎన్నుకునే హక్కు కలిగి ఉంటే, ఏ సినిమా చూడాలో కూడా అతడే నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
సినిమా అనేది దర్శకుడి ఆలోచనలను ప్రతిబింబించే కళారూపమని, దాన్ని అంగీకరించాలా లేదా అనేది పూర్తిగా ప్రేక్షకుల నిర్ణయమేనని వర్మ పేర్కొన్నారు. థియేటర్లలో కొన్ని సన్నివేశాలను తొలగించినా, అవే కంటెంట్ సోషల్ మీడియా, టెలిగ్రామ్, టోరెంట్స్ వంటి వేదికల ద్వారా గంటల్లోనే అందరికీ చేరుతుందని అన్నారు. సెన్సార్ కత్తెర వేయడం వల్ల కంటెంట్ తగ్గదని, పైగా దానికి మరింత ప్రచారం లభిస్తుందని వ్యాఖ్యానించారు.
పిల్లలు ఇప్పటికే అనేక రకాల ఆన్‌లైన్ కంటెంట్‌ను చూస్తున్న ఈ కాలంలో కేవలం సినిమాలపైనే పరిమితులు విధించడం సమంజసం కాదని వర్మ అభిప్రాయపడ్డారు. నిర్మాతలు, దర్శకులు సెన్సార్ బోర్డు విధించే అనవసర కోతలను వ్యతిరేకిస్తూ ఒకే వేదికపైకి రావాలని పిలుపునిచ్చిన ఆయన, సినిమాలకు కత్తెరలు వేయడం కంటే వాటిపై స్పష్టమైన సమాచారం ఇచ్చి చూడాలా వద్దా అనేది ప్రేక్షకుల నిర్ణయానికే వదిలేయాలని సూచించారు. చివరగా #BanTheCensor హ్యాష్‌ట్యాగ్‌తో తన అభిప్రాయాన్ని వెల్లడించగా, ఆయన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.









