భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలై 14 (వై7 న్యూస్): ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో చేపట్టిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
జిల్లాలోని సీతమ్మసాగర్, సీతారామ ఎత్తిపోతల (లిఫ్ట్ ఇరిగేషన్) ప్రాజెక్టుల పరిశీలనతో పాటు నిర్వహించనున్న సమీక్ష సమావేశం విజయవంతంగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.
ఈ సందర్భంగా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరులో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ పనులను పరిశీలించిన కలెక్టర్, నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని సూచించారు. హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అవసరమైన భద్రతా చర్యలు, బారికేడింగ్, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, పార్కింగ్ తదితర ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు.
అనంతరం అమ్మగారిపల్లి వద్ద నిర్వహించనున్న సమీక్ష సమావేశం ప్రాంగణాన్ని సందర్శించి వేదిక, కూర్చునే ఏర్పాట్లు, మీడియా సౌకర్యాలు, తాగునీరు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. సమావేశానికి హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ప్రోటోకాల్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖలతో పాటు అన్ని శాఖలు తమ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు.
ఈ పరిశీలనలో అశ్వాపురం తహసీల్దార్ సూర్యప్రకాష్, నీటిపారుదల శాఖ అధికారులు, ఆర్ అండ్ బీ అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.








