“Nobody is free until everybody is free” అంటూ అమెరికా పౌరహక్కుల ఉద్యమ నాయకురాలు ఫ్యానీ లూ హేమర్ చెప్పిన మాటలు మరోసారి ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్నాయి. కారణం #FreeAfghanWomen అనే సోషల్ మీడియా ఉద్యమం. ఒక హ్యాష్‌ట్యాగ్‌గా ప్రారంభమైన ఈ ప్రచారం ఇప్పుడు ఆఫ్ఘాన్ మహిళల హక్కులు, స్వేచ్ఛపై ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న గ్లోబల్ క్యాంపెయిన్‌గా మారింది.
ఈ ట్రెండ్‌లో భాగంగా వైరల్ అవుతున్న వీడియోలు కొన్ని సెకన్ల నిడివి మాత్రమే ఉంటాయి. మొదట ఒక యువతి చిరునవ్వుతో, సాధారణ దుస్తుల్లో కనిపిస్తుండగా బ్యాక్‌గ్రౌండ్‌లో ఆఫ్ఘాన్ జానపద సంగీతం వినిపిస్తుంది. కొన్ని క్షణాల తర్వాత సంగీతం గంభీరంగా మారి, అదే యువతి బుర్ఖా ధరించి కనిపిస్తుంది. చివర్లో #FreeAfghanWomen అనే సందేశం ప్రత్యక్షమవుతుంది. ఈ చిన్న వీడియోల ద్వారా ఆఫ్ఘాన్ మహిళలు ఎదుర్కొంటున్న పరిమితులు, వారి స్వేచ్ఛ కోసం ప్రపంచం నిలబడాలని పిలుపునిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు, సోషల్ మీడియా వినియోగదారులు ఈ ట్రెండ్‌లో పాల్గొంటున్నారు. కోట్లాది వ్యూస్, లక్షలాది కామెంట్లతో ఈ ఉద్యమం వేగంగా విస్తరిస్తోంది. “ఈ వీడియోలు హృదయాన్ని కదిలించాయి”, “ప్రతి ఒక్కరూ చూడాల్సిన సందేశం” అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. వినోదాన్ని దాటి, ఆఫ్ఘాన్ మహిళల జీవన పరిస్థితులపై ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్న ఈ ట్రెండ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.









