అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలో జరిగిన క్షిపణి దాడుల్లో ఒక భారతీయ నౌకా సిబ్బంది మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడినట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఓమన్ ప్రాంతీయ జలాల సమీపంలో ప్రయాణిస్తున్న యూఏఈకి చెందిన ‘మొంబాసా’, ‘అల్ బహియా’ అనే రెండు ఆయిల్ ట్యాంకర్లపై ఈ దాడులు జరిగినట్లు తెలిపింది.
యూఏఈ వివరాల ప్రకారం, ‘మొంబాసా’ ట్యాంకర్‌లో విధులు నిర్వహిస్తున్న భారతీయుడు ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. గాయపడిన ఎనిమిది మందిలో ఆరుగురు భారతీయులు, ఇద్దరు ఉక్రెయిన్‌కు చెందినవారు ఉండగా, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దాడి కారణంగా రెండు ట్యాంకర్లలో మంటలు చెలరేగినా, సిబ్బంది సకాలంలో స్పందించి వాటిని అదుపులోకి తీసుకురావడంతో మరింత పెద్ద ప్రమాదం తప్పింది.
ఈ ఘటనను యూఏఈ తీవ్రంగా ఖండిస్తూ, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే చర్యలను సహించబోమని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఓమన్‌లోని ఖల్హత్ ప్రాంతానికి ఈశాన్యంగా ప్రయాణిస్తున్న మరో ట్యాంకర్‌పై కూడా గుర్తుతెలియని ప్రొజెక్టైల్ దాడి జరిగినట్లు బ్రిటన్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) నివేదించింది. అయితే ఆ ఘటన యూఏఈ ట్యాంకర్లపై జరిగిన దాడులతో సంబంధం ఉందా లేదా అనేది ఇంకా అధికారికంగా స్పష్టత రాలేదు.









