E-PAPER

జీడి ఉత్పత్తి పెంపు – విలువ ఆధారిత పరిశ్రమల ఏర్పాటే లక్ష్యం

పలాస, జూలై 10 (వై7 న్యూస్): పలాస నియోజకవర్గంలో జీడి ఉత్పత్తిని మూడు రెట్లు పెంచడంతో పాటు జీడి ఆధారిత విలువ ఆధారిత పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన చర్యలపై ఎమ్మెల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో గురువారం విస్తృత స్థాయి చర్చా సమావేశం నిర్వహించారు.

నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో టెక్కలి హార్టికల్చర్ అధికారి చంద్రశేఖర్, పలాస కాజు మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లా శ్రీనివాసరావు, జీడి పరిశ్రమల యజమానులు, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీదారులు, ఎస్సార్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. జీడి సాగు విస్తరణ, దిగుబడి పెంపు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిశ్రమల అభివృద్ధి తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు.

జీడి ఉత్పత్తి పెంపులో విజయవంతమైన మహారాష్ట్రలోని రత్నగిరి, కేరళ రాష్ట్ర నమూనాలను ప్రత్యక్షంగా అధ్యయనం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందుకోసం రైతులు, పరిశ్రమల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో కూడిన బృందాన్ని ఆయా ప్రాంతాలకు పంపించి అక్కడ అమలవుతున్న ఉత్తమ విధానాలను పలాసలో అమలు చేసే దిశగా కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ, యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలంటే పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందన్నారు. పెట్టుబడిదారులకు అవసరమైన సహకారం అందిస్తూనే పర్యావరణానికి హాని కలిగించే పరిశ్రమలకు ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వబోమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

“ప్రతి చేనుకు నీరు – ప్రతి చేతికి పని” అనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, వ్యవసాయం బలోపేతంతో పాటు పరిశ్రమలు అభివృద్ధి చెందితేనే స్థానిక యువతకు విస్తృత స్థాయిలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించి పలాసను మరింత పారిశ్రామికంగా అభివృద్ధి చేయడమే తమ సంకల్పమని వెల్లడించారు.

జీడితో పాటు జీడి తొక్కను ఉపయోగించి బై-ప్రొడక్ట్స్ తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఎస్సార్ కంపెనీ ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ ప్రణాళిక అమలైతే పలాసలో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పలాస అభివృద్ధి, రైతుల సంక్షేమం, యువత ఉపాధి కోసం అందరూ కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే గౌతు శిరీష పిలుపునిచ్చారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News