పలాస, శ్రీకాకుళం జిల్లా: జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమానికి మొత్తం 171 వినతులు అందినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు.
ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన ఆర్జీలను వివిధ శాఖలకు సమర్పించగా, వాటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 88 వినతులు వచ్చినట్లు వెల్లడించారు. మిగిలిన వినతులు ఇతర శాఖలకు సంబంధించినవిగా ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, అందిన ప్రతి వినతిని నిర్దిష్ట గడువులోగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి సంబంధిత శాఖల ఉన్నతాధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజల సమస్యలను నేరుగా వినాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.








