E-PAPER

పలాసలో జర్నలిస్టుపై దాడి..!

టీడీపీ పట్టణ అధ్యక్షుడిపై ఫిర్యాదు

కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభం

శ్రీకాకుళం జిల్లా పలాసలో జర్నలిస్టుపై దాడి జరిగిందన్న ఆరోపణలు కలకలం రేపాయి. అక్రమ తవ్వకాల సమాచారాన్ని సేకరించి వార్త కవరేజ్ నిర్వహిస్తున్న సమయంలో తనపై దాడి జరిగిందని బీఆర్‌కే న్యూస్ రిపోర్టర్ యవ్వారీ తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం, గురువారం రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో పలాస సమీపంలోని గరుడుకండి ప్రాంతంలో పెట్రోల్ బంక్ వెనుక చెరువు వద్ద రాత్రి వేళ తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లారు. రోడ్డుపై నిలబడి తవ్వకాల దృశ్యాలను వీడియో చిత్రీకరిస్తుండగా, అక్కడి నుంచి ఒక లారీ బయటకు వెళ్లిందని తెలిపారు. అనంతరం పల్సర్ బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి ఆ తవ్వకాలు టీడీపీ పలాస పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజుకు సంబంధించినవని, మొక్కల పెంపకం కోసం మట్టిని తరలిస్తున్నామని చెప్పినట్లు పేర్కొన్నారు.

ఈ క్రమంలో అక్కడ ఉన్న వ్యక్తులు ఫోన్ చేయడంతో టీడీపీ పలాస పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజు, బూర్లె యోగేశ్వర్‌తో పాటు మరికొందరు అక్కడికి చేరుకుని తనపై, తనతో ఉన్న జనసేన నాయకుడు ప్రదీప్‌పై దాడి చేశారని యవ్వారీ తిరుమల ఆరోపించారు. తమను దూషించడమే కాకుండా, వారు ప్రయాణిస్తున్న స్కూటీని కిందకు తోసేసి బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఘటనపై పలాస జర్నలిస్టు అసోసియేషన్ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడులను ఖండిస్తూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అసోసియేషన్ సభ్యులు పలాస-కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వై. రామకృష్ణకు వినతిపత్రం అందజేశారు.

ఇదిలా ఉండగా, బాధితుడు ఘటన జరిగిన వెంటనే 112 అత్యవసర సేవలకు సమాచారం అందించి, అనంతరం పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

జర్నలిస్టుల భద్రతకు భరోసా కల్పించాలని, వాస్తవాలను వెలికితీసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు మీడియా ప్రతినిధులు కోరుతున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News