నటుడు ప్రకాశ్ రాజ్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయనపై సుమోటోగా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందించిన విష్ణువర్ధన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌పై కొందరు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
హిందూ ధర్మం, శ్రీరాముడు, సీతాదేవిపై అవమానకర వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌కు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్న విష్ణువర్ధన్ రెడ్డి, ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కుట్రలకు సహకరిస్తున్న వారిని గుర్తించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.








