కో5కొత్తగూడెం, జూన్ 04(వై 7 న్యూస్);
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి, జస్టిస్ జె. శ్రీనివాసరావును భద్రాచలం బార్ అసోసియేషన్ సభ్యులు శనివారం కలిసి వినతిపత్రం సమర్పించారు.
భద్రాచలంలో అడిషనల్ జిల్లా సెషన్స్ కోర్టు ఏర్పాటు చేయడంతో పాటు జ్యుడీషియల్ కోర్టులో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి, ఖాళీగా ఉన్న సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని వారు కోరారు.
చర్ల, దుమ్ముగూడెం తదితర ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు జిల్లా కోర్టు కేసుల కోసం కొత్తగూడెంకు సుమారు 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని, దీనివల్ల కక్షిదారులు మరియు న్యాయవాదులు తీవ్ర ఆర్థిక, సమయ భారం ఎదుర్కొంటున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. భద్రాచలంలోనే అడిషనల్ జిల్లా సెషన్స్ కోర్టు ఏర్పాటు చేస్తే ప్రజలకు న్యాయం మరింత చేరువవుతుందని వివరించారు.
వినతిపై హైకోర్టు న్యాయమూర్తి సానుకూలంగా స్పందించినట్లు బార్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొడాలి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు సున్నం రమేష్, హైకోర్టు సీనియర్ న్యాయవాది పీ.వి. కృష్ణమాచారి, కమిటీ సభ్యులు రావి రామ్మోహన్, పేరాల నాగరాజు, ఎస్.కే. అక్తర్, పోకుల మోహన్ కృష్ణ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.








