E-PAPER

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. జీవనోపాధి రుణాలపై అదనపు ఛార్జీలు రద్దు

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా స్వయం సహాయక సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఊరటనిచ్చింది. జీవనోపాధి రుణాలపై బ్యాంకులు వసూలు చేస్తున్న ప్రాసెసింగ్, ఇన్‌స్పెక్షన్ వంటి అదనపు ఛార్జీలను రద్దు చేయిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ మినహాయింపును అమలు చేయడం ప్రారంభించాయి. దీంతో మహిళలపై పడుతున్న అదనపు ఆర్థిక భారం తగ్గనుంది.

ఇప్పటివరకు డ్వాక్రా సంఘాలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే సమయంలో ప్రాసెసింగ్, ఇన్‌స్పెక్షన్ ఛార్జీల రూపంలో దాదాపు ఒక శాతం వరకు అదనపు రుసుము చెల్లించాల్సి వచ్చేది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి బ్యాంకులు ఈ ఛార్జీలను పూర్తిగా రద్దు చేశాయి. దీంతో మహిళలు తక్కువ ఖర్చుతో రుణాలు పొందుతూ స్వయం ఉపాధి అవకాశాలను మరింత విస్తరించుకోగలరని ప్రభుత్వం తెలిపింది.

ఈ నిర్ణయంతో రూ.20 లక్షల క్యాష్ క్రెడిట్ లోన్ తీసుకునే ఒక డ్వాక్రా సంఘానికి మూడేళ్ల కాలంలో సుమారు రూ.93,500 వరకు ఆదా కానుంది. ఒక్కో సంఘంలో 10 మంది మహిళలు ఉన్నట్లయితే, ప్రతి మహిళకు రుణ కాలపరిమితి ముగిసే నాటికి దాదాపు రూ.10 వేల వరకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళలు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా బ్యాంకుల నుంచే తక్కువ వ్యయంతో రుణాలు పొందేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని ప్రభుత్వం పేర్కొంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News